ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్రలు..
ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్రలు..
అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అడ్లూరి
ధర్మపురి, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తోందని, ఆ కుట్రలను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రలను అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అర్హుడి ఓటు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ నెలలో ఓటర్ల వద్దకు వచ్చే బూత్ లెవల్ అధికారులకు అవసరమైన సమాచారం అందించాలని కోరారు.
మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై కూడా మంత్రి స్పందించారు. ఇద్దరు నాయకులు అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు.
వడ్ల కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసిరారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాదిరిగా నాయకులను వర్గాలుగా విభజించి మాట్లాడటం తనకు తెలియదన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్షసాధింపు రాజకీయాలకు తావివ్వలేదని, సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
