సింగరేణిని నిలువుదోపిడీ చేసింది బీఆర్ఎస్: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
మెడికల్ దందాతో టీబీజీకేఎస్ కోట్లు దండుకుందన్న ఆరోపణ
అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని వ్యాఖ్య
గోదావరిఖని, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలుచేయడంతో పాటు సింగరేణి సంస్థను నిలువుదోపిడీ చేసిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) మెడికల్ వ్యవహారాల్లో కోట్ల రూపాయల దందాకు పాల్పడిందని ఆరోపించారు. కన్నెపల్లి ప్రాజెక్టు, బొగ్గు నిల్వల అంశాలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అబద్ధపు ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
