తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..
కన్నెపల్లి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులతో కళకళలాడాయి. మండలంలో 3 ప్రీ-ప్రైమరీ, 28 ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత, 3 జిల్లా పరిషత్ పాఠశాలలు కలిపి మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1,801 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మండలంలోని ముత్తాపూర్, బొగుడగూడెం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎల్లారం, గొల్లగట్టు తదితర ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వాటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు గడ్డు కాలమే
కన్నెపల్లి మండలంలో మూడు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ, వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విద్యా సంవత్సరం తొలి రోజే ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఖాళీగా తిరగడం దీనికి నిదర్శనంగా నిలిచింది.
అడ్మిషన్, పుస్తకాలు, పరీక్షలు తదితర పేర్లతో అధిక ఫీజులు వసూలు చేయడం, నాణ్యమైన బోధన లోపించడం వంటి కారణాలతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రీ-ప్రైమరీ విద్య, మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం అందుబాటులో ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
పండుగలా పాఠ్యపుస్తకాల పంపిణీ
కన్నెపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను ఆయా గ్రామాల సర్పంచ్ల చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు పంపిణీ చేశారు. జజ్జరవెల్లి పాఠశాలలో విద్యార్థులపై పుష్పాలు చల్లి, బుగ్గలు ఊదుతూ ఘనంగా స్వాగతం పలికారు.
ఉపాధ్యాయులు అంకతి తిరుపతి, సంగీత వినూత్నంగా విద్యార్థులను ఆహ్వానించడంతో చిన్నారులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. కొత్త విద్యా సంవత్సరానికి ఆహ్లాదకరమైన ప్రారంభం లభించిందని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
