TamilNaduPolitics | తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు?
TamilNaduPolitics | తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు?
TamilNaduPolitics | గౌతమి రాజీనామాతో రాజకీయ వర్గాల్లో కలకలం
విజయ్ పాలనపై పెరుగుతున్న ఆసక్తి
కొత్త పార్టీలతో వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు
అన్నామలై, లత ఎంట్రీపై జోరుగా ప్రచారం
వ్యూహం రచిస్తున్న డీఎంకే.. ఆలోచనలో అన్నాడీఎంకే
గౌతమి తదుపరి అడుగు ఏంటి?
TamilNaduPolitics | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు బలమైన ప్రాంతీయ శక్తిగా ఉన్న అన్నా డీఎంకేకి భవిష్యత్తు పై మళ్లీ చర్చ మొదలైంది. పార్టీ నుంచి తప్పుకున్నట్టు సినీ నటి గౌతమి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త నాయకత్వం, కొత్త వ్యూహాలు, పాత పార్టీల అంతర్గత ఒత్తిళ్లు కలిపి రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి.
TamilNaduPolitics | విజయ్ మార్క్ పాలన..

సినీ హీరో విజయ్ ప్రారంభించిన కొత్త రాజకీయ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ పార్టీల పై యువతలో మరింత ఆసక్తి పెరుగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయ్.. సీఎం అయిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ని ఇంటికి వెళ్లి కలవడం.. అలాగే మిగిలిన పార్టీ నేతలను కూడా కలవడం.. చూస్తుంటే.. అందర్నీ కలుపుకుని వెళ్లాలి.. మంచి పాలన అందించాలనే తపన విజయ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుందని సోషల్ మీడియాలో మరింతగా ప్రచారం మొదలైంది. అలాగే మంత్రి వర్గంలో కూడా తన మార్క్ చూపించాడు విజయ్ అని అభినందనలు అందుకున్నాడు.
TamilNaduPolitics | పుట్టుకొస్తున్న కొత్త పార్టీలు..

ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర నేత అన్నామలై వ్యూహాత్మకంగా పార్టీ నుంచి తప్పుకోవడం.. కొత్త పార్టీ పెట్టడం.. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లత ప్రజావేదిక అంటూ సేవా కార్యక్రమాలు, నాయకులను తయారు చేసేలా సంస్థను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సూపర్ స్టార్ రజినీకాంత్.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు స్టార్ట్ చేసారని.. అందుకనే రజినీ భార్య లతను రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా అన్నామలైకు రజినీ సపోర్ట్ చేస్తారని.. ప్రచారం కూడా ఊపందుకుంది.
TamilNaduPolitics | వ్యూహం రచిస్తున్న డీఎంకే..
ఆలోచనలో పడిన అన్నాడీఎంకే..

డీఎంకే పార్టీ స్టాలిన్ ఇప్పటి వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికల్లోనే తమ పార్టీ సత్తా చూపించాలి అనుకుంటున్నారు. ఇక అన్నాడీఎంకే పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఈ పార్టీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. ప్రముఖ సినీ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి పంపిన లేఖలో.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సామాజిక సేవ చేయడానికి అనువుగా బరువెక్కిన హృదయంతో పార్టీ ప్రాధమికి సభ్యత్వం, ప్రచార ఉపకార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. పూర్తి సహకారం అందించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్కరు పార్టీ నుంచి తప్పుకోవడంతో నాయకత్వం ఆలోచనలో పడింది. అయితే.. గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకోవడంతో.. విజయ్ పార్టీలో చేరతారా..? లేక డీఎంకే పార్టీలో చేరతారా..? లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?
