Fishing Ban Ends | ముగిసిన 61 రోజుల వేట విరామం
Fishing Ban Ends | ముగిసిన 61 రోజుల వేట విరామం
Fishing Ban Ends | ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు నిషేధం
నిషేధ కాలంలో ఆర్థిక భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం
తీర ప్రాంతంలో బోట్లు, వలలతో మత్స్యకారుల సందడి
కళకళలాడనున్న చేపల మార్కెట్లు
Fishing Ban Ends | అమరావతి, ఆంధ్రప్రభ: సముద్రంలో చేపల వేట నిషేధ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో సోమవారం తెల్లవారు జాము నుంచి వేటకు వెళ్లేందుకు తీరప్రాంత మత్స్యకారులు రెడీ అయ్యారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో చేపలు గుడ్లు పెడతాయి. నిషేధ గడువు ముగియడంతో వేట సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లు, వలలు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.
ఏడు మండలాలు.. 36 గ్రామాలు
ప్రకాశం జిల్లా కోస్తా తీర ప్రాంతంలోని 70 కి.మీ పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10 వేల మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి.
సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరంతా వేట సాగిస్తున్నారు. రెండు నెలల పాటు విరామం కొనసాగిన నేపథ్యంలో ఆ ప్రభావం చేపల మార్కెట్లపై కూడా పడింది. సోమవారం సాయంత్రం నుంచి ఆయా మార్కెట్లు మళ్లీ కళకళలాడనున్నాయి.
జూన్ 14 అర్ధరాత్రితో 61 రోజుల చేపల వేట నిషేధం ముగియడంతో తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపం నార్త్‌కు చెందిన యాంత్రిక పడవలతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. రెండు నెలల విరామం అనంతరం చేపల వేట కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.
వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం “మత్స్యకారుల సేవలో” పథకం కింద రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ప్రత్యేక బృందాలతో 8,554 మంది అర్హులను గుర్తించి సదరు మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది.
వేట సమయంలోనూ ఆయిల్ ఇంజిన్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు లీటరుకు రూ.9 చొప్పున డీజిల్ రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ పథకాల కింద వలలు, తాళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంజిన్లు, పడవలు, ఐస్ బాక్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది.
