AP Telangana Bhavan | ఆడిటోరియంపై ఆందోళనకర పరిస్థితి

AP Telangana Bhavan | ఆడిటోరియంపై ఆందోళనకర పరిస్థితి

AP Telangana Bhavan | వరుస అగ్ని ప్రమాదాలతో అధికార యంత్రాంగం అప్రమత్తం
ఫైర్ సేఫ్టీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు

AP Telangana Bhavan | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియానికి నేటికీ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ భవన్‌ను అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం భవనంలోనే ఆడిటోరియం నిర్మించారు. దాదాపు 500 నుంచి వెయ్యి మంది కూర్చోగల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆడిటోరియం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో కొనసాగుతోంది.

ఈ ఆడిటోరియం ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమావేశాలు, సదస్సులు, జయంతి వేడుకలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు నిరంతరం వేదికగా ఉపయోగపడుతోంది. అంబేద్కర్ జయంతి వంటి ముఖ్య దినోత్సవాల్లో కూడా నాయకులు ఇక్కడ నివాళులర్పిస్తారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ పరిపాలనా విభాగం ఈ ఆడిటోరియం నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.


వరుస అగ్ని ప్రమాద ఘటనలతో..

ఈ ఆడిటోరియం నిర్మించిన నాటి నుంచి ఇప్పటివరకు అగ్నిప్రమాద భద్రతా చర్యలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని గమనార్హం. ఇటీవల ఢిల్లీలోని మాలవీయనగర్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఆ ఘటన మరువకముందే ఆదివారం దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ వద్ద గోవింద్ పూరి ఫ్లైఓవర్ సమీపంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలతో భవన్ అధికార యంత్రాంగం అప్రమత్తంమైంది. “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా” అధికారులు ఆలస్యంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆడిటోరియానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని తాజాగా గుర్తించిన అధికారులు, తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.


సినిమా షోలు తాత్కాలికంగా బ్రేక్..

ఆడిటోరియంలో ప్రతి శని, ఆదివారాల్లో ఢిల్లీలోని తెలుగు వారి కోసం నిర్వహించే సినిమా షోలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫైర్ సేఫ్టీ కారణంగా నెల రోజుల పాటు షోలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అయితే ఇప్పటివరకు ఆడిటోరియంలో ఫైర్ సేఫ్టీ పనులు జరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలుస్తోంది. మరోవైపు పలు సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ఢిల్లీలోని తెలుగువారు ప్రశ్నిస్తున్నారు. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ ఆడిటోరియానికి ఇప్పటివరకు ఫైర్ సేఫ్టీ లేకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.