ఏకగ్రీవ ఎన్నిక.. నూతన డైరెక్టర్లకు ఘన సన్మానం
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (పాల సంఘం) చైర్మన్గా మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన దండేబోయిన మధు, కొమ్మూరి కరుణాకర్లు నూతన డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవంగా ముగియడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు నూతన డైరెక్టర్లను రైతులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పాల సంఘం అభివృద్ధికి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి కృషి చేయాలని రైతులు ఆకాంక్షించారు.
రైతుల విశ్వాసంతో మరోసారి చైర్మన్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారం, పాల సేకరణ విస్తరణ, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
