హీరపూర్‌లో మళ్లీ తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాల

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని హీరపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఏడు సంవత్సరాల క్రితం మూతపడింది. అప్పటి నుంచి గ్రామంలోని చిన్నారులు వాగు పరివాహక ప్రాంతం గుండా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెస్తవాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో నాలుగు నెలల పాటు విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో పలువురు పిల్లలు చదువుకు దూరమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను గుర్తించిన 9వ వార్డు కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో పాఠశాలను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలను పాఠశాలకు పంపించాలని, విద్య ద్వారానే భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు.

పిల్లలను ఉన్నత చదువులు చదివించి జీవితంలో అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల భవనం అపరిశుభ్రంగా ఉండటంతో కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి, రంగులు వేయించారు.

పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించి ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభించాలని మండల విద్యాధికారి రాథోడ్ సుభాష్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ, పాఠశాలకు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేసి త్వరలోనే పాఠశాలను పునఃప్రారంభిస్తామని తెలిపారు. గ్రామంలో మళ్లీ పాఠశాల ప్రారంభమైతే చిన్నారుల విద్యాభ్యాసానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.