Bihar Protest | పరీక్షా కేంద్రాలకు రవాణా సమస్యపై ఆందోళన
Bihar Protest | పరీక్షా కేంద్రాలకు రవాణా సమస్యపై ఆందోళన
పాట్లీపుత్ర స్టేషన్‌లో నిరసన
ఆందోళనకు దిగిన అభ్యర్థులు.. రైళ్ల నిలిపివేత, ఆస్తుల ధ్వంసం
లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
Bihar Protest | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీహార్‌లో ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది అభ్యర్థులు పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన క్రమంగా హింసాత్మకంగా మారడంతో కొందరు అభ్యర్థులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు అత్యవసర చైన్లను లాగి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ఆస్తులను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ నిర్వహించారు. బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు పరిస్థితిని నియంత్రించేందుకు గాల్లోకి హెచ్చరిక కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ పరిసరాలు కొంతసేపు ఉద్రిక్తంగా మారాయి. రైల్వే రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు వెల్లడించారు.
