Scholarship Awards | విద్యార్థులకు విజయ్ దేవరకొండ నగదు పురస్కారాలు

Scholarship Awards | విద్యార్థులకు విజయ్ దేవరకొండ నగదు పురస్కారాలు

Scholarship Awards | అచ్చంపేట, ఆంధ్రప్రభ: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కష్టపడి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువులే విద్యార్థులకు అసలైన ప్రేరణ అని పేర్కొంటూ.. వారు క్రమశిక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. తన తల్లిదండ్రుల ప్రేరణతోనే ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టానని విజయ్ తెలిపారు.

పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో అచ్చంపేట డివిజన్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఈ సేవలను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువుల కృషిని గుర్తించి కష్టపడి చదివి కుటుంబానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా అభినందించారు.

Scholarship Awards

అచ్చంపేట డివిజన్ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలలలో 9వ, 10వ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తరఫున ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా నగదు పురస్కారాలు అందజేశారు. ప్రథమ ర్యాంక్ సాధించిన వారికి రూ.10,000, ద్వితీయ ర్యాంక్ సాధించిన వారికి రూ.5,000 చొప్పున చెక్కుల రూపంలో బహుమతులు అందించారు.

ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మన్‌పేట గేట్ సమీపంలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ విద్యార్థులకు స్వయంగా చెక్కులు అందజేసి, వారిని అభినందిస్తూ ఫోటోలకు పోజులిచ్చి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scholarship Awards

నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో మేనేజర్లు కన్నారావు, చాంద్, తుమ్మన్‌పేట రామమోహన్‌రావు కీలకంగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లు చేశారు.

CLICK HERE TO READ Scholarship | విజయ్ దేవరకొండ, ర‌ష్మిక దంప‌తుల‌ చేయూత

CLICK HERE TO READ MORE

Leave a Reply