25percent | ఈయూ దేశాలపై.. ట్రంప్ కన్నెర్ర !
25percent | ఈయూ దేశాలపై.. ట్రంప్ కన్నెర్ర !
25percent | దిగుమతులపై 25 శాతం పన్నువిధింపు
ఆ.. దేశాలు వాణిజ్య ఒప్పందాన్నివిస్మరించాయని పెద్దన్న ఆరోపణ
వచ్చే వారం నుంచి నూతన పన్ను విధానం అమలు
నాటో దేశాలపైనా అగ్రరాజ్య అధినేత గరం గరం
జర్మనీ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణ
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇరాన్‌తో చేస్తున్నయుద్ధంలో సహకరించిన యురోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నెర్న జేశారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తయారయ్యే కార్లు, ట్రక్కులపై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈయూ దేశాలు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ నిర్ణయం వచ్చే వారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో రాసిన పోస్ట్‌లో, “ఈయూ మనతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా పాటించడం లేదు. కాబట్టి ఈయూ కార్లు, ట్రక్కులపై వచ్చే వారం నుంచి 25% సుంకం విధిస్తాం” అని ప్రకటించారు.
అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కార్లు, ట్రక్కులు తయారు చేస్తే ఎలాంటి సుంకం వర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నిర్ణయం వల్ల యూరోపియన్ కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తాయని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనం అని అన్నారు. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకపోతే బిలియన్ల డాలర్ల సుంకం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో 2025 ఆగస్టులో అమెరికా-ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం 15% సుంకం విధించారు. ఇప్పుడు దాన్ని 25%కి పెంచారు.
ఈయూ ఆగ్రహం
ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ పార్లమెంట్ అంతర్జాతీయ వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్ండ్ లెంగా తీవ్రంగా స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో అమెరికాను ఎలా నమ్మగలం? గ్రీన్‌ల్యాండ్ విషయంలో చూసినట్లుగానే సన్నిహిత మిత్రదేశాలతో కూడా ఇలా వ్యవహరించడం సరికాదు. దీనికి మేము స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాం” అని హెచ్చరించారు.
నాటో దేశాలకు కూడా ..
అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా భావించే జర్మనీకి గట్టి షాక్ ఇచ్చారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైన్యంలో సుమారు 5,000 మందిని వెనక్కి రప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ వ్యవహారంలో ఐరోపా దేశాలతో విభేదాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన వాగ్వాదం సాగుతోంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో అమెరికా అవలంబిస్తున్న యుద్ధ వ్యూహాలను జర్మనీ బహిరంగంగా విమర్శించింది.

ఇరాన్ నాయకత్వం అమెరికాను అవమానిస్తోందని, అసలు వాషింగ్టన్ దగ్గర సరైన వ్యూహమే లేదని మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతిచర్యగా, జర్మనీకి తాము అందిస్తున్న సైనిక రక్షణను తగ్గించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. దీని ప్రకారం జర్మనీ నుంచి 5,000 మంది సైనికులను ఉపసంహరించుకునే ప్రక్రియ వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పూర్తి కానుంది. ప్రస్తుతం జర్మనీలో సుమారు 36,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అంటే మొత్తం బలగాలలో 14 శాతం మందిని వెనక్కి పిలిపిస్తున్నారు.
జర్మనీలో అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిలో యూరోపియన్, ఆఫ్రికన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, రామ్‌స్టెయిన్ ఎయిర్ బేస్, ల్యాండ్‌స్టూల్ రీజినల్ మెడికల్ సెంటర్ వంటివి అతి ముఖ్యమైనవి. అఫ్గానిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు గాయపడిన అమెరికా సైనికులకు ఇక్కడే చికిత్స అందించేవారు. అంతేకాకుండా, రష్యాను అడ్డుకోవడానికి జర్మనీలో అమెరికా తన అణ్వాయుధాలను కూడా మోహరించింది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కీలక స్థావరాల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది.
