ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల అధ్యయన పర్యటన
ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల అధ్యయన పర్యటన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, దండు మల్కాపురం గ్రామాలను హైదరాబాద్‌కు చెందిన అర్నిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. కొయ్యలగూడెంలో ప్రకృతి రంగులతో చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే దుద్యాల శంకర్ సమక్షంలో డిజైన్ల ప్రత్యేకతను, రంగులు వేసే పద్ధతులను విద్యార్థులు అధ్యయనం చేశారు. అనంతరం దండు మల్కాపురం టెక్స్‌టైల్ పార్కులోని ‘మిమి క్రాఫ్ట్స్’ను సందర్శించిన విద్యార్థినులను ఉద్దేశించి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కె. కృష్ణమూర్తి మాట్లాడారు.
భారతదేశ ప్రాచీన హస్తకళలైన బాతిక్, స్క్రీన్, బ్లాక్, టై అండ్ డై ప్రింటింగ్ పద్ధతులను కాపాడుకోవాలని, మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా నూతన డిజైన్లను సృష్టించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వస్త్రాల తయారీ పద్ధతులను ఆయన ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మిమి క్రాఫ్ట్స్ నిర్వాహకురాలు పుష్పలత, దివ్య, కళాశాల అధ్యాపకులు రచన, హర్షిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
