- నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమ మాట వినకుంటే తనను కిడ్నాప్ చేస్తానని, పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని రంగరాజన్‌ను నిందితుడు వీర రాఘవ రెడ్డి బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అర్చకులను వీర రాఘవ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడని, తన సిద్ధాంతాలను అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని తన అనుచరులతో ప్రతిజ్ఞ చేయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌లలో లైంగిక వేధింపుల కేసును గుర్తించారు.
రంగరాజన్‌పై దాడి కేసులో పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపరిచారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రామ దండును సిద్ధం చేయాలని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.
రామ దండుకు మనుషులను నియమించే విషయమై రాఘవేందర్ అనే వ్యక్తి సాయంతో చిలుకూరి బాలాజీ పూజారి రంగరాజన్‌ను వీర రాఘవరెడ్డి తొలిసారి కలిసినప్పుడు ఆయన స్పందించలేదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమయ్యారు.
తమ మాట వినకపోతే రంగరాజన్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లి తాము చెప్పినట్టు చేయకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక, రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు… ఆ వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.
దాడి కేసులో పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రేపు వీర రాఘవ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.