క్రిప్టో పెట్టుబడి పేరుతో విద్యార్థినికి రూ.75,647 టోకరా..

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను నమ్మి ఓ విద్యార్థిని సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల అభిలాష (21) అనే విద్యార్థిని మే 28న ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా, ‘కృతిక అగర్వాల్’ పేరుతో ఉన్న ఐడీ నుంచి సందేశం వచ్చింది. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించడంతో ఆమె తొలుత రూ.750ను ఫోన్‌పే ద్వారా పంపించింది.

ఆ తర్వాత పెట్టుబడిపై లాభాలు వచ్చాయని, జీఎస్టీ చెల్లించాలని, బిట్‌కాయిన్ అకౌంట్ హోల్డ్‌లో ఉందంటూ వివిధ కారణాలు చెబుతూ కేటుగాళ్లు విడతల వారీగా బాధితురాలి నుంచి మొత్తం రూ.75,647 వసూలు చేశారు.

అయినప్పటికీ మరింత డబ్బు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు తన నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే కేటుగాళ్లు ఆమె ఫోన్ నంబర్లను బ్లాక్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.