ForeignTour | ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలో ప్ర‌ధాని

ForeignTour | ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలో ప్ర‌ధాని

ForeignTour | ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజ‌రు
మాక్రాన్‌తో భేటీ, వివాటెక్ సమ్మిట్‌లో హాజరు..
స్లోవేకియా పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం

ForeignTour | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగే జీ7 (G7) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడంతో పాటు, ప్రముఖ సాంకేతిక సదస్సు ‘వివాటెక్’లో హాజరుకానున్నారు. అలాగే ఫ్రాన్స్, స్లోవేకియా దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఫ్రాన్స్ పర్యటన (జూన్ 13-14 & 16-19):
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత నైస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనల ద్వారా యూరప్‌తో భారత సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు భారత్ ప్రయత్నించనుంది.

అనంతరం జూన్ 16, 17 తేదీల్లో ఎవియాన్‌లో జరిగే 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రపంచ నాయకులతో అభిప్రాయాలు పంచుకోనున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి, అవసరాలు, ఆకాంక్షలను భారత్ తరఫున ప్రధాని ప్రస్తావించనున్నారు. పారిస్‌లో జరిగే ‘వివాటెక్’ సదస్సులోనూ మోదీ పాల్గొననున్నారు. ఈ వేదికపై స్టార్టప్‌లు, డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు రంగాల్లో తాజా పరిణామాలపై చర్చలు జరగనున్నాయి.

ఇక జూన్ 14 నుంచి 16 వరకు స్లోవేకియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1993లో స్వతంత్ర దేశంగా స్లోవేకియా అవతరించిన తర్వాత భారత ప్రధాని హోదాలో ఆ దేశాన్ని సందర్శిస్తున్న తొలి నాయకుడిగా మోదీ నిలవనున్నారు.