నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
- దర్యాప్తులో పారదర్శకత ఉండాలి
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కేసుల దర్యాప్తులో పారదర్శకత ఉండాలని నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలియజేశారు. గురువారం వేములవాడ సబ్డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అవసరమైతే న్యాయ సలహాలు తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించి, నిందితుల అరెస్టులో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని స్పష్టం చేశారు. పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని, విధుల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సీఐ , ఎస్.ఐ తమ పరిధిలో స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసు శాఖపై విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు , సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్,రమాకాంత్, రమేష్, రామ్మోహన్, ప్రేమనందం, మోతిరాం తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
