Telangana – బీసీ కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాకి లెక్క‌లు – ఎమ్మెల్సీ కవిత

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాకి లెక్క‌లు చెప్పింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత అన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఆమె నేడు మీడియాతో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు ఉన్నాయ‌ని, ఆనాడు కేంద్ర ప్రభుత్వం తేల్చిన జనాభా మూడు కోట్ల 50 లక్షలు కాగా, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే లో కోటి మూడు లక్షల ఇళ్లు, మూడు కోట్ల 68 లక్షల జనాభా ఉన్న‌ట్లు తేలింద‌ని గుర్తించార‌న్నారు. కేవలం నాలుగేళ్లలో చేసిన లెక్కలతో 20 లక్షల ఇళ్లు పెరిగాయ‌ని, 2014-2024 వరకు ప‌దేళ్ల‌లోపు ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండాలి అని ప్ర‌శ్నించారు.

ఇవి కాకి లెక్క‌లు కావా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో కోటి 15 లక్షల ఇళ్లు ఉన్నాయని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, జనాభా మూడు కోట్ల 70 లక్షలు అని చెప్పింద‌ని, 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెర‌గాల్సి ఉంటుంద‌ని క‌విత అన్నారు. 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులే 13 లక్షల 78 వేల ఇచ్చింద‌ని, ప్రభుత్వం కనీసం 12 లక్షలు పెరిగినట్లు కూడా చూపించడం లేద‌ని, ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుంద‌ని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చార‌ని, ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండెమీద చేసుకుని చెప్పాల‌ని, ఇవి కాకి లెక్క‌లు కావా? అని ప్ర‌శ్నించారు.

జనాభా లెక్కలపై అనుమానం
జ‌నాభా లెక్క‌ల‌పై అనుమానం ఉంద‌ని క‌విత అన్నారు. మీ ప్ర‌భుత్వం చేసిన లెక్కలు కరెక్టే అయితే, సర్వేలో తానిచ్చిన వివరాలు, త‌న‌ పేరు ఆధార్ కార్డు కొడితే రావాలి క‌దా అని అన్నారు. మూడు కోట్ల 50 లక్షల మంది సర్వే రిపోర్ట్ వెబ్ సైట్ లో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. ఇది చిన్న విషయం… కాదు పెద్ద విషయం… ప్రభుత్వం ఆగమాగం చేస్తోంద‌న్నారు. మంత్రివర్గ సమావేశం వెంటనే అసెంబ్లీ సమావేశం, సమావేశంలో ఇది లఘు చ‌ర్చ అని చెప్ప‌డం విచిత్రంగా ఉంద‌న్నారు.

బీసీ జనాభా అంటే చిన్న చూపా?
బీజీ జనాభా అంటే చిన్న చూపుస్తున్నార‌ని క‌విత అన్నారు. ప్ర‌భుత్వ‌ లెక్కల ప్రకారమే 46.2 శాతం ముస్లిం మైనార్టీల 10% మొత్తం 56% బీసీలకు రిజర్వేషన్ క‌ల్పించాల‌ని, బీఆర్ఎస్ పై నేపం నెట్టి ఎన్నికలను దూరం చేసే ప్రయత్నం చేయొద్ద‌ని, కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంకా మిస్ అయిన వారి కోసం మళ్ళీ అవకాశం ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. 15 రోజులపాటు రివ్యూకు అవకాశం ఇచ్చి ఎన్ రోల్ చేసుకోని వారికి అవకాశం కల్పించాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ తర్వాత బీసీ సంఘాలను కలుపుకొని బీసీ సాధికారత, రాజకీయంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ దక్కే వరకు పోరాడుతామ‌న్నారు. జనాభా లెక్కలు తక్కువ చేసి చూపించే విధంగా చూడవద్దని ఆమె కోరారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ప్రస్తుతం ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *