చేనేతకు టెండర్ల తూటా.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

చేనేతకు టెండర్ల తూటా.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

నేతన్నల జీవనోపాధి దెబ్బతింది..

టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రభ, వరంగల్ తూర్పు: కాశీబుగ్గ: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల తెలంగాణలోని చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, వేలాది నేతన్నల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. వరంగల్ కొత్తవాడలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఐదు రోజులుగా మగ్గాలు బంద్ చేసి ఆందోళన చేస్తున్న చేనేత సహకార సంఘాల కార్మికులకు గురువారం బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. చేనేత, పద్మశాలి సామాజిక వర్గాల ఓట్లతో గెలిచిన మంత్రి కొండా సురేఖ, మాజీ మేయర్ గుండు సుధారాణి నేతన్నల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ వారిని తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు.

పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లకు అవసరమైన యూనిఫాంలు, కార్పెట్లు, బెడ్‌షీట్ల కొనుగోళ్లను టెస్కో ద్వారా చేపట్టే విధానాన్ని పక్కనబెట్టి ఓపెన్ టెండర్ల విధానాన్ని తీసుకురావడం వల్ల చేనేత రంగం నష్టపోయిందన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వరంగల్ కార్పెట్లకు ఆర్డర్లు రద్దు చేయడం ద్వారా దాదాపు 10 వేల చేనేత కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే ఓపెన్ టెండర్ల విధానాన్ని రద్దు చేసి, టెస్కో ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లు, విద్యాసంస్థలకు అవసరమైన కార్పెట్లు, బెడ్‌షీట్ల ఆర్డర్లను స్థానిక చేనేత సహకార సంఘాలకే కేటాయించాలని కోరారు. నేతన్నల బీమా, నూలు సబ్సిడీ పథకాలను పునరుద్ధరించి, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే సచివాలయ ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. నేతన్నలకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రత్నం సతీష్ షా, తాబేటి వెంకట గౌడ్, కనుకుంట్ల రంజిత్, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, బైరి నాగరాజు, జిల్లా నాయకులు డైరీ శ్యామ్‌సుందర్, ముండ్రాతి వెంకటేశ్వర్లు, మాదాసు రాజు, అంకాల జనార్ధన్, కొంతం సంగీత్, విప్ప సుధాకర్, మార్త ఉషారాణి, బండి సుజాత, కందగట్ల మల్లికార్జున్‌తో పాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.