నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర: బచ్చలకూరి నాగరాజు

నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర: బచ్చలకూరి నాగరాజు

ఆంధ్రప్రభ ఖమ్మం బ్యూరో: బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండించారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి పన్నిన కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ వంటి నాయకులు రాజ్యసభలో ఉంటే బీజేపీ కుట్రలు బహిర్గతమవుతాయనే ఉద్దేశంతోనే ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని విమర్శించారు. నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉందా అని ప్రశ్నించారు.

రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, బీజేపీ ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఈ చర్యకు పాల్పడిందని నాగరాజు మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ గండు జానయ్య, ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు పొట్ట పంజర రవి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గట్టికొండ విజయ్, యువజన కాంగ్రెస్ నాయకుడు గుండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.