ఇంద్రకీలాద్రిపై డిజిటల్ పారదర్శకతకు పెద్దపీట
ఇంద్రకీలాద్రిపై డిజిటల్ పారదర్శకతకు పెద్దపీట
భక్తుల సౌకర్యాల మెరుగుదలకు పలు చర్యలు
ఒకే అధికారిక క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ చెల్లింపులు
లడ్డూ కౌంటర్లలో మర్యాదపూర్వక సేవలు తప్పనిసరి
దేవస్థానం బస్సుల్లో దుర్గా నామస్మరణ, సమాచార వ్యవస్థ ఏర్పాటు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శకమైన డిజిటల్ సేవలు, మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా దేవస్థానం యంత్రాంగం పనిచేస్తోందని పేర్కొన్నారు. గురువారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన ఈవో, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది, ఏఈవోలతో కలిసి పలు కీలక విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాల మెరుగుదలకు యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన పలు ఆదేశాలు జారీ చేశారు.

దేవస్థానంలో ఆర్థిక పారదర్శకతను పెంపొందించేందుకు డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించాలని ఈవో సూచించారు. దేవస్థానం పరిధిలో కేవలం “శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం” పేరుతో ఉన్న అధికారిక క్యూఆర్ కోడ్ మాత్రమే ప్రదర్శించబడాలని, పాత లేదా ఉపయోగంలో లేని క్యూఆర్ కోడ్‌లు, కాలం చెల్లిన డిజిటల్ చెల్లింపు బోర్డులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి అధికారిక క్యూఆర్ కోడ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ధృవీకరిస్తూ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సంయుక్తంగా సర్టిఫికేట్ సమర్పించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వాట్సాప్ సేవలను మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అలాగే దేవస్థానానికి చెందిన ప్రసాద, సేవా స్టాల్స్ వివరాలు భక్తులకు సులభంగా తెలిసేలా నిరంతరం మైక్ ప్రకటనలు నిర్వహించాలని ఆదేశించారు. కొండపై, కొండ దిగువన ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాల వద్ద అత్యున్నత స్థాయి పరిశుభ్రత పాటించాలని, భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.అమ్మవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసేందుకు వచ్చే భక్తులతో లడ్డూ కౌంటర్ల సిబ్బంది మర్యాదగా, భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలని ఈవో ఆదేశించారు. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘాట్ రోడ్డులో నడిచే దేవస్థానం ఉచిత బస్సుల్లో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా శ్రీ దుర్గా నామస్మరణ, ఆధ్యాత్మిక శ్లోకాల ప్రసారం నిరంతరం కొనసాగేలా ఆడియో వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా దర్శన సమయాలు, దేవస్థాన సేవలు, కొండపై అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలు ప్రయాణంలోనే భక్తులకు తెలియజేసే సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి సమీక్షా పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఏఈవోలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
