Asian Games 2026 | షూటింగ్ ట్రయల్స్‌లో భారత షూటర్ల హవా…

Asian Games 2026 | షూటింగ్ ట్రయల్స్‌లో భారత షూటర్ల హవా…

  • సరబ్‌జోత్, రాహి, హిమాన్షు మెరుపులు..
  • జట్టు ఎంపికకు ముందు ఉత్కంఠ

ఆంధ్ర‌ప్ర‌భ : ఆసియా క్రీడలు (Asian Games) 2026 కోసం భారత షూటింగ్ జట్టు ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డెహ్రాడూన్‌లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజీ త్రిశూల్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న T4 నేషనల్ సెలెక్షన్ ట్రయల్స్లో దేశంలోని అగ్రశ్రేణి షూటర్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు, మాజీ ప్రపంచ ఛాంపియన్లు, ఆసియా క్రీడల మెడలిస్టులు ఒకే వేదికపై పోటీ పడుతుండటంతో ట్రయల్స్ ఉత్కంఠభరితంగా మారాయి.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత సరబ్‌జోత్ సింగ్ విజేతగా నిలవగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఆర్మీ షూటర్ లక్షిత చివరి క్షణాల్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో అఖిల్ శెఓరాన్, మహిళల విభాగంలో సాక్షి సునీల్ పడేకర్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.

Asian Games

మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మాజీ ఆసియా క్రీడల ఛాంపియన్ రాహి సర్ణోబత్ తన అనుభవాన్ని మరోసారి నిరూపించింది. ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్ పై పైచేయి సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మను రజతంతో సరిపెట్టుకోగా, దివ్య టీఎస్ కాంస్య పతకం సాధించింది.

Asian Games

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో హర్యానా షూటర్ హిమాన్షు ధిల్లాన్ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. చివరి షాట్‌కు ముందు వెనుకబడినా, చివరి ప్రయత్నంలోనే మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుని స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల ఎయిర్ రైఫిల్‌లో దీక్ష వైశ్య, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో సూరజ్ శర్మ విజేతలుగా నిలిచారు.

Asian Games

జట్టు ఎంపికపై ఉత్కంఠ..

ఈ ట్రయల్స్ ఆధారంగానే సెప్టెంబర్-అక్టోబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగే Asian Games 2026 కోసం భారత రైఫిల్, పిస్టల్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే షాట్‌గన్ విభాగానికి 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా, రైఫిల్, పిస్టల్ విభాగాల జాబితా ట్రయల్స్ ముగిసిన వెంటనే వెల్లడించే అవకాశం ఉంది.

ట్రయల్స్‌లో ప్రధాన విజేతలు
సరబ్‌జోత్ సింగ్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
లక్షిత – మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
అఖిల్ శెఓరాన్ – పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
సాక్షి సునీల్ పడేకర్ – మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
రాహి సర్ణోబత్ – మహిళల 25 మీటర్ల పిస్టల్
హిమాన్షు ధిల్లాన్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
దీక్ష వైశ్య – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
సూరజ్ శర్మ – పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్

TORF | ట్రాక్ రెడీ… మీరు రెడీనా?