మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే చర్య: రఘువీరారెడ్డి
మడకశిర, ఆంధ్రప్రభ : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ను అసంబద్ధమైన, అన్యాయమైన కారణాలతో తిరస్కరించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ఏకపక్ష చర్యలు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసి, ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తాయని పేర్కొన్నారు.
అర్హత ఉన్న అభ్యర్థిని సందేహాస్పద మార్గాల ద్వారా పోటీ చేయకుండా నిరోధించడం కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్య విలువలు, నిష్పక్షపాత ప్రాతినిధ్యంపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందని అన్నారు.
రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి సంస్థలను వినియోగించినప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లదని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లితే దేశ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పలు వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య విధానాలను అణచివేసే ఇలాంటి చర్యలు ఎన్నికల వ్యవస్థపై మరింత మచ్చ తెస్తాయని అన్నారు.
భారత ప్రజలు పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, ప్రజాస్వామ్య నియమాల పట్ల గౌరవాన్ని ఆశిస్తున్నారని పేర్కొన్న ఆయన, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
