కూటమి హామీలకు ఏమైంది?..
కూటమి హామీలకు ఏమైంది?..
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ చర్చావేదిక కార్యక్రమం మంగళవారం ఉరవకొండ పట్టణంలోని దేవాంగ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
పేదలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారని, ప్రస్తుత పాలన ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తోందని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిరుపేదలు, రైతుల ప్రభుత్వం కాదని, వ్యాపార వర్గాల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసనగా ఈ నెల 12న ఉరవకొండలో నిర్వహించే ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, రమణ, కొండారెడ్డి, వీరన్న, ఎర్రిస్వామి, అశోక్‌కుమార్, యోగేందర్‌రెడ్డి, ఈడిగ ప్రసాద్, సిద్ధార్థ, ఓవన్న, ఎర్రిస్వామిరెడ్డి, వెలిగొండ నరసింహులు, తిప్పయ్య, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
