Telangana Congress Cabinet Expansion | తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ కుస్తీ..
Telangana Congress Cabinet Expansion | తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ కుస్తీ..
Telangana Congress Cabinet Expansion |కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారిన కేబినెట్ విస్తరణ
సామాజిక సమీకరణాలతో సీఎంకు పెరుగుతున్న ఒత్తిడి
మంత్రి పదవుల కోసం ఢిల్లీ స్థాయిలో సీనియర్ల లాబీయింగ్
రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రాతినిధ్యంపై అసంతృప్తి
Telangana Congress Cabinet Expansion | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమస్యలతో సతమతమవుతోంది. మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదల ఒకవైపు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలను మెప్పించాలన్న బాధ్యత మరోవైపు పార్టీని కలవరపెడుతోంది. దీనికి తోడు పార్టీలో సీనియర్ల పెద్దరికం, పదవుల కోసం ఆరాటం, పోరాటం, తనను సంప్రదించకుండానే అధిష్ఠానం వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేయడం వంటి ప్రతికూల చర్యలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
సగానికి పైగా నాయకులంతా తనకన్నా సీనియర్లే కావడంతో, వారిని ఎదిరించే సాహసం చేయలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతమతమవుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పదవులెన్ని భర్తీ చేసినా ఇంకా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. ఇక మిగిలింది రెండు మంత్రి పదవులు మాత్రమే. దానికీ పదుల సంఖ్యలో పోటీ నెలకొంది.
ఈ పరిణామాలు సీఎం రేవంత్‌రెడ్డికి నాయకత్వ బాధ్యతను భారంగా, దినదిన గండంగా మార్చేస్తున్నాయి. ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు చేపట్టిన కసరత్తు కత్తిమీద సాములా మారింది. మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన.. ఈ రెండూ కీలకంగా మారాయి. వచ్చే రెండున్నరేళ్ల పాలన, ఆ తర్వాత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీనియర్ల డిమాండ్‌తో పాటు కుల, సామాజిక సమీకరణాలు పెద్ద సవాల్‌గా మారాయి. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం కష్టసాధ్యంగా మారింది. కేబినెట్‌లో గరిష్టంగా పద్దెనిమిది పదవులు ఉండగా, అందులో ఇప్పటికే 16 భర్తీ అయ్యాయి. ఇక మిగిలింది రెండే మంత్రి పదవులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్‌గా మారింది. ఎవరిని విస్మరించినా వారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడం కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
అసంతృప్తులను దారిలో పెట్టడమే పెద్ద సమస్య
పదవి దక్కని వారు అసంతృప్తికి లోనైతే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ముందే పసిగట్టి, వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
రాష్ట్ర నాయకత్వం ఎంత కసరత్తు చేసినా, తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీ పెద్దలదేనన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, నాయకుల పనితీరును దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం మంత్రి పదవులు కేవలం రెండే ఖాళీగా ఉండగా, ఆశిస్తున్న సీనియర్ నేతల సంఖ్య పదుల్లో ఉంది. ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోవడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది. సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాములా మారింది. ఏ వర్గానికి అన్యాయం జరిగినా అది ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సామాజిక వర్గాల పాత్ర కీలకం కావడంతో ముఖ్యమంత్రి, అధిష్ఠానం ఈ సమీకరణాలను కచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాల ప్రాతినిధ్యంపై పెరుగుతున్న ఒత్తిడి
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఉదాహరణకు నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి వంటి జిల్లాలకు చెందిన సీనియర్లు ఈసారి మంత్రి పదవి తమకే దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. పదవుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి పెద్దల ఆమోదం తప్పనిసరి.
పలు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ వ్యవహారాలు, దేశ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఇక్కడి మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం తగిన సమయం వెచ్చించలేకపోయిందని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు.
మంత్రి పదవులు లేని ఆ రెండు జిల్లాలు
ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ముగ్గురేసి, ఇద్దరేసి చొప్పున మంత్రులు ఉండగా, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాలకు ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మంత్రులు లేని జిల్లాల్లో సలహాదారులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. అవి కూడా నామినేటెడ్ పదవులు కావడంతో ప్రభుత్వంలో వారికంత ప్రాధాన్యం లభించడం లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, జితేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌రావు, చిన్నారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కేశవరావు తదితరులను సలహాదారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీ సభ్యుడు లేరు.
ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న మైనారిటీ మంత్రి కోటాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవుల కోసం తమకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
మంత్రి పదవులు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించే ప్రక్రియను ప్రభుత్వం మొదటగా ఎంచుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ, అసలైన కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
