వానల్లేక… వేడెక్కిన ‘విద్యుత్’ మీటర్లు

వానల్లేక… వేడెక్కిన ‘విద్యుత్’ మీటర్లు

  • మృగశిర లో మండుతున్న ఎండలు
  • అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వాడకం
  • ఏ సి,కూలర్లు, ఫ్యాన్లు,ఫ్రిడ్జి ల వినియోగం అధికం
  • పేదలకు ఫ్రీ కరెంటు దూరం – ఆర్థిక భారం
  • ఉచిత విద్యుత్… ‘హై’ ఫై

మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణలో గత 3 నెలలుగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాల్లేక విద్యుత్ మీటర్లు సైతం వేడెక్కుతున్నాయి. దీంతో మోత్కూర్ మున్సిపాలిటీతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో గృహా వినియోగదారుల విద్యుత్ బిల్లులు కాస్త విపరీతంగా పెరిగాయి. ఇటు ఎండలు అధికమవ్వడం.. అటు వర్షాలు లేక ఏ ఇంట్లో చూసినా చల్లదనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసి, ఫ్రిడ్జిల వాడకం కాస్త పెరగడంతో విద్యుత్ వాడకం పెరిగి బిల్లులు మోత మోగుతున్నాయి. కనీసం గత 3 నెలలుగా ఒక్క భారీ వర్షం కూడా లేకపోవడం, మృగశిర కార్తె వచ్చినా… తొలకరి కాస్త పులకరించకపోవడంతో… వేడెక్కిన జనం చల్లదనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

మోత్కూర్ మున్సిపాలిటీ తో పాటు, మండలంలో మొత్తం 11 వేల 285 మంది గృహ వినియోగదారులు ఉండగా, 5860 మంది ఇందిరమ్మ ఉచిత కరెంటు (200 యూనిట్ల ఫ్రీ) పొందుతున్నారు. మార్చి నెల వాడకం సంబంధించి 200 మంది, ఏప్రిల్ లో 280 మంది, మే నెలలో సుమారు 400 మంది గృహ వినియోగదారులు 200 యూనిట్ల వాడకం దాటడంతో ఉచిత కరెంట్ కి కాస్త అనర్హులు కాగా… బిల్లులు కాస్త పెరిగి ఆర్ధిక భారం అయ్యింది. 200 యూనిట్లు దాటి 1,2 యూనిట్ల వాడకం అయినా మొత్తం యూనిట్ల రీడింగ్ కి బిల్లు రావడంతో చాలా మంది గృహావినియోగదారులు ఆవాక్కయ్యారు. దీంతో ఈ నెల విద్యుత్ బిల్లులు చెల్లించక తప్పడం లేదు. కేవలం ఎండలు అధికం కావడం, వర్షాలు లేకపోవడం, వాతావరణం కాస్త చల్లబడకపోవడంతో ఉచిత విద్యుత్ కాస్త ‘ హై’ ఫై గా మారింది.