Andhra Pradesh Agriculture | చిన్న, సన్నకారు రైతులకు భారీ ఊరట

Andhra Pradesh Agriculture | చిన్న, సన్నకారు రైతులకు భారీ ఊరట

Andhra Pradesh Agriculture | వ్యవసాయ యంత్రాలకు రైతుల నుంచి అనూహ్య స్పందన
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులే లక్ష్యం
రాయితీ పథకంలో పారదర్శక ఎంపిక ప్రక్రియ
లాటరీ ద్వారా అర్హులైన రైతుల ఎంపిక
ఆధునిక పరికరాలతో తగ్గనున్న కష్టం, ఖర్చు

Andhra Pradesh Agriculture | అమరావతి, ఆంధ్రప్రభ: రాయితీపై ప్రభుత్వం అందించే వ్యవసాయ యంత్ర పరికరాలకు రైతుల నుంచి ఈ ఏడాది అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలకు కేటాయించిన యూనిట్ల కన్నా నాలుగైదు రెట్లు అధికంగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ వ్యవసాయాధికారులు పరిశీలించారు. అందరికీ ఇవ్వాలంటే జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ మొత్తం కన్నా నాలుగు రెట్లు నిధులు అవసరమవుతాయని గుర్తించారు. దీంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు ఈ దఫా భారీగా స్పందించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఈ పథకాన్ని పునరుద్ధరించింది. అందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించి, జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టేసరికి ఆలస్యమైంది. దీంతో వాటిని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా కసరత్తు సాగుతోంది.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పూర్తిస్థాయిలో ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. రైతులు వినూత్న, ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్న సంకల్పంతో భారీ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తోంది.

ఈ ఏడాది లబ్ధిదారులకు అందించే సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు భారీ ఊరట ఇచ్చింది. వ్యవసాయంలో పెట్టుబడి భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వెనుకబడిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ శాతాన్ని పెంచింది. దీంతో అన్ని వర్గాల రైతులకు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

దరఖాస్తుల వడపోత కార్యక్రమం

రాయితీపై రైతుల ఆశలు.. లాటరీ ద్వారా అర్హులైన రైతుల ఎంపిక

గతం కన్నా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగేలా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, లాటరీ ద్వారా ఎంపికకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికలో లోటుపాట్ల నివారణకు లాటరీని జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించనుండగా, మొత్తం ప్రక్రియ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో సాగేలా నిర్దేశించారు.

ఈ విడత సబ్సిడీపై ట్రాక్టర్లు, వాటికి అనుబంధంగా ఉండే పవర్ టిల్లర్లు, పంటల సంరక్షణ యంత్రాలు, పంట కోతలు, నూర్పిడి చేసే యంత్రాలు వంటివి ఉన్నాయి. పారదర్శకంగా కొన్నింటిపై 40 నుంచి 50 శాతం సబ్సిడీ కూడా ఉంది. మొత్తం యూనిట్లను ఆయా జిల్లాల్లో మండలాల ఎంపిక వారీగా విభజించారు. ఆయా మండలాల్లో సాగయ్యే పంటలు, సాగు విస్తీర్ణం, వాటికి ప్రస్తుతం ఇచ్చే యంత్ర పరికరాల వాడకం ఆధారంగా కేటాయించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు వంటివి రాయితీపై అందిస్తారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు వ్యవసాయ యంత్రాల యూనిట్ ధరలో 50 శాతం రాయితీ ఇస్తారు. మిగిలిన రైతులకు 40 శాతం రాయితీ అందిస్తున్నారు.

ఆయా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. ఈ పథకం కింద ఎంపికైన రైతుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అర్హులను భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట వంటి వివరాల ద్వారా ఎంపిక చేస్తారు. రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను మిగిలిన డబ్బులను 15 రోజుల్లో డీలర్లకు చెల్లించాలి. ఆ తర్వాత 15 రోజులకు యంత్రాన్ని రైతుకు అందజేస్తారు.

26లోగా పంపిణీకి సన్నాహాలు

అందుబాటులో ఆధునిక పరికరాలు

బృహత్తర పథకం కింద రైతులకు వ్యవసాయంలో అవసరమైన అనేక రకాల ఆధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా భూమిని సిద్ధం చేయడంలో అత్యంత కీలకమైన భారీ ట్రాక్టర్లు, రోటావేటర్లు ఈ రాయితీ పరికరాల జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. అలాగే పాత పద్ధతులను పక్కనపెట్టి భూమిని వేగంగా దున్నేందుకు అవసరమైన ఆధునిక నాగళ్లు, దమ్ము చక్రాలు సైతం పొందవచ్చు.

మందులు, ఎరువులు సమర్థవంతంగా పిచికారీ చేయడానికి ఉపయోగపడే ట్రాక్టర్‌తో అనుసంధానించిన ఆధునిక పిచికారీ యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్లను అందిస్తున్నారు. పంట అవశేషాలను సులభంగా తొలగించే యంత్రాలు, వృథాగా పోయే గడ్డిని బేళ్లు కట్టే యంత్రాలు తదితర పరికరాలు కూడా లభిస్తాయి.

కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ ఆధునిక యంత్రాలు అన్నదాతల కష్టాన్ని, ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి. ఈనెల 26 వరకు యంత్రాలు రైతులకు అందజేసే కార్యక్రమం జరుగుతుండగా, 30వ తేదీ నుంచి డీలర్‌కు రాయితీ డబ్బులు విడుదల చేస్తారని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Leave a Reply