9న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
9న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
చిలుపూర్, ఆంధ్రప్రభ: ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో సభ స్థలం వద్ద చేయాల్సిన ఏర్పాట్లను విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సోమవారం కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 60.62 కోట్ల రూపాయల విలువైన 7 విద్యుత్ సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కులంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సుమారు 6 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 6 వేల మందితో నిర్వహించనున్న సభకు సంబంధించి స్టేజ్, సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఏసీపీ భీమ్ శర్మతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
