20 లీటర్ల గుడుంబా స్వాధీనం.. ఇద్దరు మహిళల అరెస్ట్

భూపాలపల్లి (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్‌వ్యాలీ స్కూల్ వెనుక భాగంలో గురువారం ఉదయం సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గుడుంబా తరలిస్తున్న అజ్మీరా రాజిత (40), నంగావత్ పార్వతి (38)లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భూపాలపల్లి మండలం పెద్దకుంటపల్లి తండాకు చెందినవారని పోలీసులు తెలిపారు.

నిందితులను, స్వాధీనం చేసుకున్న గుడుంబాతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు.