గ్రీవెన్స్‌కు వచ్చి పురుగుమందు సేవనం..

గ్రీవెన్స్‌కు వచ్చి పురుగుమందు సేవనం..

కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం కలకలం

గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన కే. నాని అనే యువతి పురుగుమందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది.

బాధితురాలి కథనం ప్రకారం, తన తండ్రి, బాబాయ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తనను, తన తల్లిని వేధిస్తున్నారని ఆరోపించింది. తన తల్లి వద్ద ఉన్న 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం తన తండ్రికి రెండో వివాహం జరిపించి, తమను పట్టించుకోకుండా మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది.

ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని, సమస్య పరిష్కారం కాకపోవడంతోనే కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చి పురుగుమందు సేవించినట్లు యువతి పేర్కొన్నట్లు సమాచారం.

ఘటనను గమనించిన అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కలెక్టరేట్ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.