ప్రకాశ్ రాజ్ ‘పార్ట్-టైమ్’ పాలిటిక్స్ ఇక్కడ సాగవు: పెంటేల బాలాజీ
ప్రకాశ్ రాజ్ ‘పార్ట్-టైమ్’ పాలిటిక్స్ ఇక్కడ సాగవు: పెంటేల బాలాజీ
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : కేవలం లైమ్‌లైట్‌లో ఉండటానికి, రాజకీయ లబ్ధి కోసం ప్రతి విషయాన్ని వక్రీకరించడం సినీనటుడు ప్రకాశ్ రాజ్‌కు అలవాటుగా మారిందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ధ్వజమెత్తారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను బాలాజీ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ… ఒక రాజకీయ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ, నాయకుడిపై నమ్మకం అనేవి ప్రాథమిక సూత్రాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన కోసం నాయకుడి వ్యూహాలకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం బెదిరింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. క్రమశిక్షణకు, బానిసత్వానికి ఉన్న తేడా కూడా తెలియని స్థితిలో ప్రకాశ్ రాజ్ ఉన్నారా అని ఎద్దేవా చేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ప్రశ్నించే హక్కు గురించి పవన్ కళ్యాణ్‌కు మీలాంటి ‘ట్విట్టర్’ మేధావులు క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేనకు ప్రజలు ఇచ్చిన తీర్పే పవన్ కళ్యాణ్ నాయకత్వానికి నిదర్శనమని వెల్లడించారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, మీలాంటి వారికి సమాధానం చెప్పుకుంటూ కూర్చోవాల్సిన పని తమ నాయకుడికి లేదన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చి ట్వీట్లు వేయడం, సమాజంలో అలజడి సృష్టించడం ప్రకాశ్ రాజ్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇకనైనా అనవసరపు విమర్శలు మానుకోవాలని, మెగా ఫ్యామిలీపై, జనసేన అంతర్గత క్రమశిక్షణపై బురదజల్లాలని చూస్తే జనసైనికులు, ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని బాలాజీ హెచ్చరించారు.
