8 june. 2026 indrakeelaadri |ఇంద్రకీలాద్రిపై భక్తుల జాతర
అమ్మదర్శానికి బారులు
ఆదివారం 63377 మందికి కనకదుర్గమ్మ దర్శనం
10 వేల మందికి పైగా అన్నప్రసాదం స్వీకరణ
4,284 మంది తలనీలాల సమర్పణ
హుండీలు, విరాళాల ద్వారా రూ.6.62 లక్షల ఆదాయం
రద్దీని పర్యవేక్షించిన ఏసీ రంగారావు
(ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి) : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. వారాంతపు సెలవుదినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆదివారం మొత్తం 63,377 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 12,745 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు 1,22,01 ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తుల నుంచి హుండీలు, విరాళాల రూపంలో రూ.6,62,011 ఆదాయం సమకూరింది. ఆలయంలో నిర్వహించిన వివిధ ప్రత్యేక సేవల్లో 375 మంది భక్తులు పాల్గొనగా, మొక్కులు తీర్చుకునేందుకు 4,284 మంది తలనీలాలు సమర్పించారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకం ద్వారా 10,108 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ దర్శనం, ప్రసాదాల పంపిణీ, తలనీలాల సమర్పణ, అన్నదాన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ క్యూలైన్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆదివారం నమోదైన ఈ గణాంకాలు ఇంద్రకీలాద్రిపై భక్తుల అచంచల విశ్వాసాన్ని, శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి ఉన్న విశేష ఆదరణను మరోసారి చాటిచెప్పాయి. నిత్యం వేలాదిమంది భక్తులు అమ్మవారి కృపాకటాక్షాల కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తుండటం ఆలయ మహిమాన్విత వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది.
