Rashmika | ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్

Rashmika | ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్

Rashmika | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: భారతీయ కర్ణాటక సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ స్థానం సంపాదించిన ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో సుబ్బలక్ష్మి పాత్ర కోసం రష్మిక మందన్న పేరు వినిపిస్తుండటంతో సినిమా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తాజా కథనాల ప్రకారం.. ఈ బయోపిక్ కోసం రష్మిక మందన్నను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, ఆమెపై లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘జెర్సీ’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే పాత్ర కోసం సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే తుది ఎంపికపై క్లారిటీ రావాల్సి ఉంది.

భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతానికి చేసిన సేవలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపు, సంగీత ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత నటీనటులు, సాంకేతిక బృందం, షూటింగ్ వివరాలపై స్పష్టత రానుంది.