పెద్దమ్మ ఆలయ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

పెద్దమ్మ ఆలయ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సంగారెడ్డి, ఆంధ్రప్రభ:

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న నూతన షెడ్డు పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని తన సొంత నిధులతో చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించి, నిర్మాణ వ్యయాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వానల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా వెంటనే స్పందించి షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లేశ్వరి కుమారుడు మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, ఇస్నాపూర్ పెద్దమ్మ ఆలయానికి ప్రతి వారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారని, పండుగలు, జాతరల సమయంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, కౌన్సిలర్లు మన్నే రాఘవేంద్ర, వెంకటేష్ నాయక్, సంగన్నగారి గోపాల్, సందీప్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.