మెదక్ రైతులకు ఆయిల్ ఫామ్ సాగు సువర్ణ అవకాశం
కలెక్టర్ ప్రతిమ సింగ్
ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచన
నిజాంపేట, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని చల్మెడ గ్రామంలోని లీ ఫామ్ ఆయిల్ ఫామ్ నర్సరీని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీని పరిశీలించి, అక్కడి ఏర్పాట్లు, మొక్కల పెంపకం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా రైతులకు ఆయిల్ ఫామ్ సాగు సువర్ణ అవకాశమని అన్నారు. జిల్లాలో లీ ఫామ్ సంస్థ ఆయిల్ ఫామ్ మొక్కలను పెంచి రైతులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటగా ఆయిల్ ఫామ్ రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, ఆయిల్ ఫామ్ సాగుతో పాటు ఇతర అంతర పంటలను కూడా సాగు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ అందిస్తున్నందున రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపాలని కలెక్టర్ కోరారు.
అనంతరం లీ ఫామ్ డైరెక్టర్ రంగనాయక్తో కలిసి కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆయిల్ ఫామ్ మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, ఏవోఓ శ్రీలత, ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
