Modi | భారత యువ హాకీ జట్లకు ప్రధాని మోదీ అభినందనలు
Modi | భారత యువ హాకీ జట్లకు ప్రధాని మోదీ అభినందనలు
- హాకీలో భారత్ జోరు..
- యువ జట్లపై ప్రధాని ప్రశంసల వర్షం
అండర్-18 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన భారత పురుష, మహిళల హాకీ జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. యువ ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
“మన యువ హాకీ ఆటగాళ్లు సాధించిన ఈ విజయం అద్భుతమైన ఘనత. పురుషుల అండర్-18 హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. టోర్నీ అంతటా అసాధారణ నైపుణ్యం, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి ఫైనల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం యువతలో హాకీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
అలాగే కాంస్య పతకం సాధించిన భారత మహిళల అండర్-18 హాకీ జట్టును కూడా ప్రధాని ప్రశంసించారు.
“అండర్-18 ఆసియా కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత మహిళల జట్టుకు అభినందనలు. టోర్నీ మొత్తం వారు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఈ విజయం భారత మహిళల హాకీ బలోపేతం అవుతున్నదానికి, మన ఆటగాళ్లలో అపారమైన ప్రతిభ ఉందనడానికి నిదర్శనం. భవిష్యత్ పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జపాన్ను 4-1తో ఓడించి భారత పురుషుల జట్టు మూడోసారి అండర్-18 ఆసియా కప్‌ను కైవసం చేసుకోగా, మహిళల జట్టు దక్షిణ కొరియాపై 3-0తో విజయం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
