Flat No.906 | 9వ అంతస్తు నుంచి కిందకు నోట్ల బ్యాగులు…
Flat No.906 | 9వ అంతస్తు నుంచి కిందకు నోట్ల బ్యాగులు…
Flat No.906 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. మొహాలీ జిల్లాలో నిర్వహించిన దాడుల సమయంలో ఓ భవనం 9వ అంతస్తు నుంచి నగదు నిండిన బ్యాగులను కిందికి విసిరేయడం కలకలం రేపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొహాలీలోని ఖారర్ రెసిడెన్షియల్ సొసైటీలో ఉన్న వెస్ట్రన్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఫ్లాట్ నెంబర్ 906 నుంచి రెండు బ్యాగులను భవనం పై అంతస్తు నుంచి కిందికి పడేశారు. వాటిలో రూ.500 నోట్ల కట్టలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భవనం సమీపంలో కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికంగా కలకలం చెలరేగింది.

మొహాలీతో పాటు చండీగఢ్‌లోని 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బిల్డర్లు, హౌజింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లైసెన్సుల విషయంలో భారీ భూ అక్రమాలు, ప్రజలను మోసం చేసి వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సన్‌టెక్ సిటీ ప్రాజెక్టు, ఏబీఎస్ టౌన్‌షిప్స్, ఆల్టస్ బిల్డర్స్, ధిర్ కన్స్‌ట్రక్షన్స్ సంస్థలపై కూడా ఈడీ దృష్టి సారించింది.
జీమాడా ఫీజుల వ్యవహారంలో డిఫాల్టర్లకు రాజకీయ రక్షణ కల్పించారనే ఆరోపణలతో ప్రభుత్వ అధికారికి సన్నిహితుడైన నితిన్ గోహెల్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఘటనపై ఈడీ అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
