ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత..

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత, భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) గోడౌన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం త్రైమాసికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ టి.ఎల్. సంగీత పాల్గొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గోడౌన్ సీళ్లను తెరిపించి, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

యంత్రాల భద్రత, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలును సమీక్షించిన సుదర్శన్ రెడ్డి, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం గోడౌన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, మాస, త్రైమాసిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సామగ్రి భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గున్నాల రాజేందర్, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జైరాంనాయక్, పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.