ఫుడ్ పార్క్ భూముల విక్రయంపై వివాదం..
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో పారిశ్రామిక వాడ (ఫుడ్ పార్క్) ఏర్పాటుకు 2005లో పేద రైతుల నుంచి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున సుమారు 200 ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అక్కడ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవడంతో పాటు, ఇటీవల ఫుడ్ పార్క్‌కు చెందిన 84 ఎకరాల భూమిని విక్రయించినట్లు సమాచారం వెలుగులోకి రావడం వివాదానికి దారితీసింది.
ఈ వ్యవహారం ప్రజా సంఘాలు, రైతు సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూములను ఏ ప్రాతిపదికన విక్రయించారని, ధర నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరించారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన భూముల విక్రయానికి క్యాబినెట్ ఆమోదం, బహిరంగ వేలం వంటి ప్రక్రియలు తప్పనిసరి కాగా, అవి పాటించారా లేదా అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.50 లక్షలకు పైగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటప్పుడు తక్కువ ధరకు భూముల విక్రయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి పారదర్శకత పాటించలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, విక్రయించిన భూముల్లో మామిడి, వేప, తాటి తదితర విలువైన చెట్లు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అయినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికి కలపను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లక్షల రూపాయల విలువ చేసే చెట్లు నరికివేతకు గురవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సంవత్సరాల పాటు సంరక్షించిన చెట్లు కనుమరుగవుతుండటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. భూముల విక్రయం, చెట్ల నరికివేత, అనుమతుల ప్రక్రియ తదితర అంశాలపై విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
