𝐁𝐢𝐠 𝐛𝐨𝐨𝐬𝐭 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 | భారత ఇంధన రంగ ఆత్మనిర్భరతకు మెగా బూస్ట్!

𝐁𝐢𝐠 𝐛𝐨𝐨𝐬𝐭 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 | భారత ఇంధన రంగ ఆత్మనిర్భరతకు మెగా బూస్ట్!

  • అండమాన్‌లో గ్యాస్ నిల్వల గుర్తింపు
  • సముద్ర మంథన్ మిషన్ ఫలితం..
  • అండమాన్‌లో సహజవాయువు ఆనవాళ్లు
  • అండమాన్ బేసిన్‌లో గ్యాస్ నిల్వలు..
  • ఆత్మనిర్భర్ ఎనర్జీ లక్ష్యానికి మరో అడుగు

భారత్ ఇంధన స్వయంసమృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) అండమాన్ దీవుల తూర్పు తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో సహజవాయువు (నేచురల్ గ్యాస్) నిల్వలను గుర్తించింది. అండమాన్ సముద్రంలోని విజయపురం-3 అన్వేషణ బావిలో ఈ సహజవాయువు ఆనవాళ్లు లభించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల లోతున్న సముద్ర ప్రాంతంలో ఈ బావిని తవ్వారు. దాదాపు 1,900 మీటర్లకు పైగా లోతులోని ఈఓసీన్ (Eocene) శిలా నిర్మాణంలో నిర్వహించిన ప్రారంభ ఉత్పత్తి పరీక్షల్లో నిరంతర గ్యాస్ ఫ్లేరింగ్ ద్వారా సహజవాయువు ఉనికిని నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్యాస్ నమూనాలను సేకరించి దాని నాణ్యత, కెలోరిఫిక్ విలువ, మూలాధారాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం 2025 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సముద్ర మంథన్ మిషన్’ (జాతీయ లోతట్టు సముద్ర అన్వేషణ మిషన్)లో భాగంగా దేశంలోని సముద్ర జలాల్లో భారీ స్థాయిలో చమురు, గ్యాస్ అన్వేషణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత అన్వేషణలో ఆయిల్ ఇండియా తవ్విన మూడు బావుల్లో రెండింటిలో హైడ్రోకార్బన్ ఆనవాళ్లు లభించడం విశేషం.

ఈ ఆవిష్కరణ భారత్ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత లోతట్టు సముద్ర అన్వేషణ సంస్థలైన పెట్రోబ్రాస్, టోటల్ ఎనర్జీస్, బీపీ, షెల్, ఎక్సాన్‌మొబిల్ వంటి సంస్థలతో కలిసి భవిష్యత్ అన్వేషణ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇక భారత్ బ్రిక్స్ (BRICS) అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (CCUS) సాంకేతికతలపై ఒఎన్‌జీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో CCUS సాంకేతికత కీలకమని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

సహజవాయువు నిల్వల గుర్తింపు భారత ఇంధన రంగానికి కీలక మైలురాయిగా నిలవడంతో పాటు ‘ఆత్మనిర్భర్ ఎనర్జీ’ లక్ష్య సాధనకు మరింత బలాన్నిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.