కార్మిక లోకానికి ఎల్లన్న సేవలు చిరస్మరణీయం: హరీశ్‌రావు

కార్మిక లోకానికి ఎల్లన్న సేవలు చిరస్మరణీయం: హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జి. ఎల్లన్న 85వ జయంతి ఉత్సవాలు శుక్రవారం తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎల్లన్న కేవలం కార్మిక నాయకుడిగానే కాకుండా చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ యోధుడని కొనియాడారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఆయన పేరు తెలియని వారు లేరన్నారు. సాధారణ కార్మికుడిగా ప్రారంభమైన ఎల్లన్న ప్రస్థానం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ఉపాధ్యక్ష స్థాయికి చేరిందని చెప్పారు. కార్మికుల గౌరవాన్ని పొందిన నాయకుడిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమం కోసం ఎంఐజీ-2 కాలనీ సాధించడంలో ఎల్లన్న కీలక పాత్ర పోషించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. స్థానిక యువత ఉద్యోగాల కోసం సీఐఎస్ఎఫ్ యాజమాన్యంతో రాజీ పడకుండా పోరాడారని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఎల్లన్న ఉద్యమ స్ఫూర్తిని కోల్పోలేదన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అంకితభావంతో పనిచేశారని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం కంటే కార్మికులు, తెలంగాణ సమాజం కోసం ఎక్కువగా ఆలోచించిన నిస్వార్థ నాయకుడని పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎల్లన్నను గౌరవిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్ ఏర్పాటులో ఎల్లన్న, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేసిన కృషిని గుర్తుచేశారు. అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో కాలనీ సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం ఎల్లన్న స్థాయికి తగిన విధంగా లేదని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఎల్లన్న సంప్రదాయ వేషధారణలో నిలబడి ఉన్న రూపంలో 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే రెండు నెలల్లో జరిగే ఎల్లన్న వర్ధంతి నాటికి తగిన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

భౌతికంగా ఎల్లన్న మన మధ్య లేకపోయినా, బీహెచ్‌ఈఎల్ ఉన్నంతకాలం ఆయన పేరు కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్‌ప్రతాప్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.