Prakasam | 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం..
Prakasam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలో శుక్రవారం పల్లెవెలుగు బస్సు బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. కొండపి–మద్దూరు రహదారిపై ద్వారకా సీఫుడ్స్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికుల సహాయంతో వారిని కొండపి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 20 మంది పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
