సీ ఫుడ్ రవాణాకు పూర్తి సహకారం అందిస్తాం: రామ్మోహన్ నాయుడు

సీ ఫుడ్ రవాణాకు పూర్తి సహకారం అందిస్తాం: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: దేశీయంగా, అంతర్జాతీయంగా సముద్ర ఆహార ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుకు ఎయిర్ కార్గో సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ఫుడ్ రవాణా విషయంలో పౌర విమానయాన శాఖ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ జాతీయ సెమినార్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి, నలుగురు కేంద్ర మంత్రులు ఒకే సెమినార్‌లో పాల్గొనడం సముద్ర ఆహార ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. దేశీయ రవాణా అయినా, అంతర్జాతీయ రవాణా అయినా సరైన సమయంలో సరుకును చేరవేసే వ్యవస్థ ఎయిర్ కార్గో వద్ద సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్ కార్గో రవాణా ఛార్జీలను మరింత సరళం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి కారణమని రామ్మోహన్ నాయుడు అన్నారు. 1990 దశకంలోనే చంద్రబాబు నాయుడు ఈ రంగానికి పునాది వేశారని తెలిపారు. సరైన కార్యాచరణతో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆనందకరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సీ ఫుడ్ కేవలం వ్యాపారం కాదని, అది ప్రజల జీవన విధానమని ఆయన అన్నారు. సీఈఓలు, రైతులు, పరిశ్రమలు, పర్యావరణం పట్ల చంద్రబాబు నాయుడు సమతుల్య దృష్టితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. విశాఖలో సైకిల్‌పై సవారీ చేస్తూ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చురుకుదనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘నమో’ అంటే నాయుడు, మోదీ కలయిక అని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనేక అసాధ్యాలను రాష్ట్రంలో సుసాధ్యం చేసిన ఘనత ఇరువురు నేతలకు దక్కుతుందని అన్నారు.

భోగాపురం విమానాశ్రయాన్ని ఎగిరే చేప ఆకృతిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ‘వన్ ఎయిర్‌పోర్ట్.. వన్ ప్రొడక్ట్’ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని భోగాపురంలో సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తామని హామీ ఇచ్చారు.

విమానయానం అంటే చాలామంది ప్రయాణికుల రవాణానే గుర్తు చేసుకుంటారని, అయితే కార్గో రవాణాకూ తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. 2014 నుంచి దేశంలో 90కిపైగా విమానాశ్రయాలు నిర్మాణం అయ్యాయని, 2047 నాటికి 350 విమానాశ్రయాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

సీ ఫుడ్‌ను మరింత నాణ్యతతో అందించాలంటే ఎయిర్ కార్గో రవాణా అవసరమని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు వంటి మల్టీ మోడల్ కనెక్టివిటీని ఉపయోగించుకుని మత్స్య సంపదను సరైన సమయంలో, సరైన స్థానానికి చేరేలా చేయాలని సూచించారు. దీనివల్ల ఈ రంగంలో ఉన్న వ్యాపారులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.

పీఎం గతి శక్తి పథకంలో భాగంగా భోగాపురం, నవీ ముంబై, నోయిడా సహా పలు విమానాశ్రయాల్లో కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇందులో సీ ఫుడ్ రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమలో ఉన్నవారు ఎయిర్ కార్గో సేవలను మరింతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్, చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ బీద మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.

Leave a Reply