సైకిల్‌పై దూసుకెళ్లిన ఎమ్మెల్యే గిత్త..

పచ్చదనమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం
చంద్రబాబు బాటలో పర్యావరణ యజ్ఞం 7 కి.మీ సైకిల్ యాత్రతో ప్రజల్లోకి జయసూర్య

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : మాటలు కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యావరణ దినోత్సవం రోజు సంచలనానికి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో కదిలిన ఎమ్మెల్యే, 7 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ పచ్చదనం-పరిశుభ్రత నినాదాన్ని గడపగడపకు తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం అల్లూరు గ్రామం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, వాహనాలు వద్దు, సైకిల్ ముద్దు అనే నినాదంతో ఎమ్మెల్యే యువతలో స్ఫూర్తి నింపారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా నాయకుడే మార్గదర్శకుడిగా నిలవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి అనుగుణంగా ఎమ్మెల్యే జయసూర్య కళాశాల ఆవరణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. పచ్చదనంతోనే జీవితాల్లో వెలుగు, అభివృద్ధిలో వేగం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నందికొట్కూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రకటించారు. విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజీలతో పాటు ప్రతి వీధిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మోడల్ కళాశాలగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పర్యావరణ పరిరక్షణ ఒక్క ప్రభుత్వం బాధ్యత కాదని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వాహనాల వినియోగం తగ్గించి ఇంటికో మొక్క నాటితే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించిన వాళ్లమవుతామని అన్నారు. అదేవిధంగా నందికొట్కూరు పట్టణానికి ప్రత్యేకంగా వెయ్యి ముక్కలు నాటే కార్యక్రమాన్ని రూపొందించినమని అన్నారు ఆరు కోట్ల నిధులతో నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధికి బాటలు వేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగన్న ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. పూర్వ విద్యార్థి సంఘం నాయకులు మండ్లెం రామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మద్దూర్ హరి సర్వోత్తమ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ కన్వీనర్ గుంజుపల్లె భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.