Parakala | హత్య మిస్టరీ వీడింది.. నిందితుడి అరెస్ట్

Parakala | హత్య మిస్టరీ వీడింది.. నిందితుడి అరెస్ట్

  • వివాహేతర సంబంధమే హత్యకు కారణం..
  • 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

పరకాల, (ఆంధ్రప్రభ): పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం పరకాల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సతీష్ బాబు కేసు వివరాలను వెల్లడించారు.

జూన్ 3న ఉదయం 10:30 గంటలకు ఎండీ రజాక్ తన తమ్ముడు ఎండీ షరీపుద్దీన్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 2 రాత్రి 10:50 గంటల సమయంలో వెల్లంపల్లి రోడ్డులోని నజరేతు చర్చి సమీపంలో షరీపుద్దీన్ తన పల్సర్ బైక్‌తో పాటు మృతదేహంగా కనిపించాడని, ఇది ప్రమాదమా లేక హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారా అనే అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు సేకరించి కేసును ఛేదించారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. చర్లపల్లికి చెందిన ఎండీ షరీపుద్దీన్ (38) హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం రేగొండ మండలం పోచంపల్లికి చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి మూడు నెలల పాప ఉంది.

ఎండీ షరీపుద్దీన్ భార్య చిట్యాల మండలం కైలాసపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండటంతో దంపతులు పరకాల పట్టణంలోని సాగర్‌వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

పరకాలకు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్‌కు షరీపుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. షరీపుద్దీన్ ఉద్యోగరీత్యా ఇంట్లో లేని సమయంలో తన భార్యకు టిఫిన్, ఇతర అవసరమైన వస్తువులు అందించాలని సందీప్‌ను కోరేవాడు. ఈ క్రమంలో సందీప్‌కు ఎండీ షరీపుద్దీన్ భార్యకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.

షరీపుద్దీన్ వల్ల తమ సంబంధం బయటపడుతుందని భావించిన సందీప్, అతడిని హత్య చేయాలని పథకం రచించాడు. జూన్ 2 రాత్రి షరీపుద్దీన్‌ను ఫోన్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ రేకుల షెడ్ వద్దకు పిలిచాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు.

ఈ సందర్భంగా ఎండీ షరీపుద్దీన్ భార్యతో సందీప్ కు ఉన్న సంబంధం విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సందీప్ సమీపంలో ఉన్న కర్రతో షరీపుద్దీన్ తలపై రెండు సార్లు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే షరీపుద్దీన్ మృతి చెందాడు.

ఆ తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు షరీపుద్దీన్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి రోడ్డుపై పడేసి ప్రమాదం జరిగినట్లుగా సృష్టించాడు. అనంతరం ఇంటికి వెళ్లి రక్తపు మరకలు ఉన్న చొక్కాను కాల్చివేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు సందీప్ నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. నిందితుడిని తీసుకెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని గుర్తించామని చెప్పారు.

ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పరకాల సీఐ వి. క్రాంతికుమార్, ఎస్సైలు రమేష్, పవన్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని ఏసీపీ సతీష్ బాబు అభినందించారు. వారికి రివార్డులు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.