మొక్కలు నాటుదాం..
ప్లాస్టిక్కు దూరంగా ఉండుదాం: మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి వనంలో నిర్వహించిన హరిత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సంయుక్తంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. భూమి మనందరి ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం అని పేర్కొంటూ, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
గాలి, నీరు, నేల కలుషితం కాకుండా కాపాడుకోవడం, సహజ వనరులను పరిరక్షించడం, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అత్యవసరమని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మోటార్ వాహనాలకు బదులుగా సైకిళ్లు, ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
తల్లిదండ్రుల పేరుతో రెండు మొక్కలు నాటే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం అభినందనీయమన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కల నాటడం, కాలువలు, డ్రైన్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని, ఇంటి ఆవరణతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గడంతో పాటు ప్రాణవాయువు లభ్యత కూడా మెరుగుపడుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న), జిల్లా ఇన్చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
