వేడి నీటితో వంట పాత్రలు శుభ్రం చేయాలి..

మధ్యాహ్న భోజనంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

శావల్యాపురం, ఆంధ్రప్రభ: మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ఉపయోగించే వంట పాత్రలను తప్పనిసరిగా వేడి నీటితో శుభ్రం చేయాలని మండల విద్యాశాఖ రెండో అధికారి పుసులూరి లలితకుమారి సూచించారు.

మండలంలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు శుక్రవారం శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న లలితకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరంగా, పరిశుభ్రంగా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. వంట తయారీ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వంట ప్రారంభించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

ఆహారం తయారీ సమయంలో పోషక విలువలు కోల్పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మధ్య ప్రభుత్వ మెనూ ప్రకారం వంటల తయారీ పోటీలు నిర్వహించారు. ఇందులో శావల్యాపురం, మతుకుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కారుమంచి హెచ్‌సీ పాఠశాల నిర్వాహకులు ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు, ప్రధానోపాధ్యాయుడు టి.వి. కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు టి. గురుబాబు, రిసోర్స్ పర్సన్లు బిల్లా రాజా రమేష్, శ్రీహరి, సీఆర్పీలు ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply