2.5cr | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్
2.5cr | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో డీప్యూటీ సీఎం పవన్
2.5cr | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా, మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా సీడ్ బాల్స్ తయారీలో పాల్గొన్నారు. అంకుడు, తెల్ల పొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ వృక్ష జాతుల విత్తనాలతో ఈ బంతులను తయారు చేశారు.
2.5cr | రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో…
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో ఒకేసారి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మూలపాడు కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పవన్ కల్యాణ్ గారు వీక్షించారు. పాల్గొన్న ప్రజలతో మాట్లాడి విత్తనాల ఎంపిక, తయారీ పరిమాణం వంటి వివరాలు తెలుసుకున్నారు. వన సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అలాగే చిన్నారులు సీడ్ బాల్స్ ప్రాధాన్యతపై వివరించిన విధానాన్ని అభినందించారు. జూన్ 15 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి దశలో డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను జారవిడిచే ప్రక్రియను ఆయన పరిశీలించారు.
2.5cr | ప్రతి ఎకో పార్క్‌లో యోగా హాల్
అంతకుముందు బటర్‌ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను పరిశీలించిన పవన్ కల్యాణ్, ఎకో టూరిజం నమూనాను సమీక్షించారు. ప్రతి ఎకో టూరిజం పార్కులో తప్పనిసరిగా ఒక యోగా హాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
2.5cr | చేతివృత్తుల అభివృద్ధికి హామీ
కొండపల్లి కొయ్యబొమ్మల తయారీలో ఉపయోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించిన ఆయన, కళాకారుల పనితీరును ఆసక్తిగా చూశారు. ఉదయగిరి కళాకారులు తయారు చేసిన చెక్క ఉత్పత్తులు, వంట సామాగ్రి, వాచ్‌లు, ల్యాప్‌టాప్ నమూనాలు ఆయనను ఆకట్టుకున్నాయి.
చిత్తూరు కళాకారులు చెక్క కొరత సమస్యను ప్రస్తావించగా, “వుడ్ బ్యాంక్” ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కళాకారులను ప్రత్యక్షంగా కలిసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు ప్రతిమను తయారు చేయాలని కళాకారులు కోరగా, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసతం కృష్ణ ప్రసాద్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.
