పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలీతో చైతన్యం
పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలీతో చైతన్యం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో భారీ సైకిల్ యాత్ర
ఉత్సాహంగా సైకిల్ తొక్కిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
పుట్టపర్తి, ఆంద్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పుట్టపర్తిలో గురువారం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
పుట్టపర్తి సత్యమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ గోపురం వరకు కొనసాగింది. ర్యాలీలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి యువకుడిలా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకట్టుకున్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు. “పర్యావరణాన్ని కాపాడుదాం – హరిత భవిష్యత్తుకు బాటలు వేయుదాం” అంటూ సందేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు రామారావు గంగాధర్ నాయుడు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌కోటి ఆదినారాయణ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు జయప్రకాశ్, కృష్ణప్రసాద్, సురేష్ చౌదరి, బేకరీ నాయుడు, మిట్టపల్లి గంగాధర్, మెప్మా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
