టెంకాయపై ఆవిష్కృతమైన సందేశం…
టెంకాయపై ఆవిష్కృతమైన సందేశం…
చూడగానే ఆలోచింపజేసే కళాఖండం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్న కళాఖండాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని చాటిచెప్పేలా టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలను గీసి అందరి దృష్టిని ఆకర్షించారు.
మైక్రో బ్రష్‌లు, వాటర్ కలర్ పెయింటింగ్స్ సాయంతో సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. పర్యావరణ సమతుల్యత ఉన్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందో, పర్యావరణ విధ్వంసం జరిగితే కరువు పరిస్థితులు ఎలా ఉంటాయో చిత్రాల రూపంలో ప్రతిబింబించారు.

పచ్చని చెట్లు, కొండలు, కోనలు, ఎగిరే పక్షులు, జంతువులు, పశువులు, నదీజలాలు, జలచరాలతో కళకళలాడే ప్రకృతి దృశ్యాలను ఒకవైపు చిత్రీకరించారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ వనదేవత చిరునవ్వుతో కనిపించేలా కళాత్మకంగా ఆవిష్కరించారు.
మరోవైపు పర్యావరణ నాశనం వల్ల ఏర్పడే క్షామ పరిస్థితులను హృదయాన్ని కదిలించేలా చిత్రించారు. ఎండిపోయిన చెట్లు, నరికివేసిన అడవులు, నీరు, ఆహారం, నీడ లేక అలమటిస్తున్న వన్యప్రాణులు, జీవరాశుల కష్టాలను ప్రతిబింబించారు. ఈ దృశ్యాలను చూసి వనదేవత కన్నీరు మున్నీరవుతూ మానవులను పర్యావరణ పరిరక్షణకు పిలుపునిస్తున్నట్లు చిత్రించారు.
ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి, చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు కలిసి ఏర్పడే జీవావరణమని చెప్పారు. ప్రతి జీవరాశికి పర్యావరణమే జీవనాధారమని పేర్కొన్నారు.
మానవుల స్వార్థ ప్రయోజనాల కారణంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం పెరిగి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందన్నారు. ప్రతి ఏడాది లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, జల వనరులను కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా భాగస్వాములు కావాలని సూచించారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
