పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించాలి
పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించాలి
పామాయిల్ సాగుతో లాభాలు పొందే అవకాశం: ప్రభుత్వ విప్ విజయ రమణారావు
పెద్దపల్లి నియోజకవర్గంలో 98 శాతం వడ్ల కొనుగోలు పూర్తి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడిపై దృష్టి సారించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు సూచించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5 వార్డులకు సంబంధించిన గ్రామసభలను గురువారం ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతులు ఎప్పటికప్పుడు పంటల మార్పిడి చేస్తే భూసారం పెరుగుతుందని విజయ రమణారావు తెలిపారు. ఇందులో భాగంగా లాభసాటిగా ఉండే పామాయిల్ తోటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పామాయిల్‌తో పాటు ఆరుతడి, వాణిజ్య పంటల సాగును కూడా రైతులు పరిశీలించాలని సూచించారు. తాను కూడా తన మూడు ఎకరాల పొలంలో పామాయిల్ తోట సాగు చేయనున్నట్లు చెప్పారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 98 శాతం వడ్ల కొనుగోలు పూర్తయిందని ఆయన తెలిపారు. పంటల నిల్వ కోసం 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణాన్ని ఎలిగేడు మండలంలో ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఇదే విధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గోదాములు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
రైతులు ఇబ్బందులు పడితే రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విజయ రమణారావు విమర్శించారు. రైతులకు మేలు జరిగితే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. గతంలో బస్తాకు 10 కిలోల చొప్పున వడ్ల కటింగ్‌లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో పెద్దపల్లి ఆసుపత్రి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిందని, ఇటీవల ఈ ఆసుపత్రి ఆరు అవార్డులు పొంది ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, ప్రకాష్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
